ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం నిర్వహించే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులు భక్తి, శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తారని, ఇలాంటి పుణ్యకాలంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం సామాజిక సౌహార్దానికి మార్గదర్శకమని తెలిపారు.
అన్ని మతాల సందేశం ఒక్కటేనని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ అందజేసి ఉపవాస దీక్షను ముగింపజేశారు. అనంతరం ముస్లిం ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు పవిత్ర ఖురాన్ను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సిపిఓ సంజీవరావు, ఏపీ ఆర్వో అజ్గర్ హుస్సేన్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ముస్లిం ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment