మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకుందాం - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు పండుగలు దోహదపడతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండల స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నమాజు అనంతరం ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతాభావాన్ని పెంచుతున్నాయని అన్నారు. ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ప్రభుత్వం పండుగల సమయాల్లో అధికారిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
పవిత్ర రంజాన్ మాసం సమాజంలో శాంతిని నెలకొల్పుతుందని, ప్రజల మధ్య గల విద్వేషాలను దూరం చేస్తుందని తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టిన కఠినమైన ఉపవాస దీక్షలు వారి కుటుంబాలతో పాటు సమాజంలో శాంతిని, ప్రేమను నెలకొల్పడానికి, సోదరభావం, దాతృత్వాన్ని పెంచడానికి దోహదపడుతుందని, ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటి చెబుతుందని వివరించారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులకు తాను చేస్తున్న కృషికి ప్రజలు, అధికారులు సహకరించి మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్, మతగురువులు మహమ్మద్ మునావర్ హుస్సేన్, అబ్దుల్ అజీజ్ మంజార్, మత పెద్దలు జహంగీర్ షరీఫ్, రబ్ సాబ్, అబీద్ హుస్సేన్, జావీద్ సాటే, బాసిత్ భాయ్, ఖాద్రి, యాకూబ్, సీపీఐ నాయకులు దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళి, తూము చౌదరి, నాగా సీతారాములు, పల్లపోతు సాయి, మాజీ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment