వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు: భాగం హేమంతరావు
జె.హెచ్.9. మీడియా, పాల్వంచ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు విమర్శించారు. బుధవారం మండలంలోని జగన్నాధపురం ముంతాజ్ ఫంక్షన్ హాల్‌లో రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది.
సమావేశానికి భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత రైతు సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం, భాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు వ్యవసాయాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం బలహీనపడితే దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని, రుణమాఫీ వందశాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలకు ఇచ్చిన సబ్సిడీని తిరిగి అమలు చేయాలని, పోడు సాగుదారులకు హక్కుల పత్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, నారాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్, బిక్కులాల్, వేములపల్లి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment