చర్ల పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్‌ను అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) పంకజ్ పరితోష్ ఐపీఎస్ ప్రారంభించారు. కార్యక్రమానికి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పంకజ్ పరితోష్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యను మధ్యలోనే ఆపేసి ఇతర పనుల్లో నిమగ్నమయ్యే యువత తమ ప్రతిభను క్రీడల ద్వారా చాటుకోవాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గొంగిడి త్రిష మహిళల క్రికెట్‌లో విశేష ప్రతిభ చూపి, టీమ్ ఇండియాకు ప్రపంచకప్ అందించేందుకు కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, పోలీసు శాఖ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు. విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలను మెరుగుపరచేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొని, గెలుపోటములను సహజంగా తీసుకుని ముందుకు సాగాలని అధికారులు సూచించారు.

Post a Comment