ఏఐతో విద్యాబోధన విద్యార్థులకు వరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఏఐ ఆధారిత బోధన తరగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా సహాయపడుతుందని వివరించారు. విద్యార్థుల స్థాయిని అంచనా వేసే విధంగా అభ్యాస కృత్యాలు రూపొందించడం ద్వారా బోధన మరింత ప్రభావవంతంగా మారుతుందని అన్నారు.
కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, జిల్లాలో ప్రేరణాత్మక విద్యాబోధనను ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులందరూ ప్రతి రోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. బూర్గంపాడు మండలంలోని అంజనాపురం, మొరంపల్లి బంజారా, బూర్గంపాడు-2, నాగినేని ప్రోలు, సారపాకలోని గాంధీనగర్ పాఠశాలలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
ఏఐ ఆధారిత బోధనలో భాగంగా మండలంలోని ఒక ఉపాధ్యాయుడిని హైదరాబాదుకు శిక్షణ కోసం పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షించాలని సంబంధిత ఎంఈఓలకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో బూర్గంపాడు డిప్యూటీ తహసీల్దార్ నరేష్, బూర్గంపాడు ఎంఈఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment