పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి – ఎస్పీ రోహిత్ రాజు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసి, న్యాయస్థానాల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేసుల ఆలస్యానికి గల కారణాలను విశ్లేషించి, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ, సంబంధిత వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. NBW (నాన్-బెయిలబుల్ వారెంట్) జారీ విషయంలో ఆలస్యం చేయకుండా నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్థులకు శిక్షపడేలా కృషి చేసి, కన్విక్షన్ రేటును పెంచాలని ఆయన పేర్కొన్నారు. కేసుల విచారణలో ఏవైనా సందేహాలు తలెత్తితే, వెంటనే ఉన్నతాధికారుల సూచనలు తీసుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment