యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. శుక్రవారం దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ములకపాడు క్రీడా మైదానంలో ప్రారంభమైన మండల స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్) పరితోష్ పంకజ్ ఐపీఎస్, ఏఎస్పీ (భద్రాచలం) విక్రాంత్ సింగ్ ఐపీఎస్ పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 54 టీములు పోటీపడనున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దుమ్ముగూడెం మండలంలోని యువత కోసం సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో పోలీసుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నామని వివరించారు.

దుమ్ముగూడెం మండలం నుంచి యువత క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగి, ఈ ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు.

యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువులో రాణించి తమ తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఇటీవల అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి, భారత్‌కు కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన గొంగిడి త్రిష మన జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.

అదే విధంగా, ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోక్సో కేసులలో నిందితులకు ప్రస్తుతం అమలవుతున్న శిక్షలను వివరించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్‌ను అద్భుతంగా నిర్వహించిన దుమ్ముగూడెం పోలీసులను, భద్రాచలం ఏఎస్పీని అభినందించారు.

ఈ కార్యక్రమంలో 141 బీఎన్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జునన్, దుమ్ముగూడెం సీఐ అశోక్, ఎస్సైలు వెంకటప్పయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.