పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డైనింగ్ హాల్, తరగతి గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు.పరిశీలనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డార్మెటరీ డోర్లు, కిటికీలు, త్రాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. డార్మెటరీ హాల్లో దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేయాలని, ప్రహరీ గోడపై కంచ ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన నివేదికలు సమర్పించాలని సూచించారు.


వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లేని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెనూను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం అందరి బాధ్యత అని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే వారు బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరగలరని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, పాఠశాల హెడ్‌మాస్టర్ బద్రు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.