పాల్వంచ మహిళకు జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కోర్టు హాలులోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడిన ఓ మహిళకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ. సుచరిత శుక్రవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా..2017 ఫిబ్రవరి 28న కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసుల కాల్ వర్క్ నిర్వహించుచుండగా, పాల్వంచ వెంకటేశ్వర కాలనీకి చెందిన కొడాలి నర్మద కోర్టు హాలులోకి ఒక్కసారిగా దూసుకువెళ్లింది. ఆ సమయంలో వాయిదాకు హాజరైన పాల్వంచ మండలం ఇల్లందులపాడు చెందిన గుగులోత్ మాన్సింగ్‌ను కోర్టులో, జడ్జి ఎదుటే, దాడి చేసి అతని గల్లా పట్టుకొని బూతులు తిడుతూ చేతులతో కొడుతుండగా, కోర్టులో ఉన్న పలువురు న్యాయవాదులు నర్మదా నుండి మాన్సింగ్‌ను విడిపించారు.
ఈ విషయంపై అప్పటి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జమలేశ్వరరావు, కోర్టు సూపరింటెండెంట్ రషీద్ అలీ ఖాన్‌ను ఆదేశించగా, 2017 మార్చి 1న రషీద్ అలీ ఖాన్ కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ జి. తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టులో ఏడుగురు సాక్షులను విచారించారు. నిందితురాలైన కొడాలి నర్మదాపై నేరం రుజువు కావడంతో ఐపీసీ పరిధిలోని వివిధ సెక్షన్ల క్రింద ఏడాదిన్నర జైలు శిక్ష, ₹2000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్‌ను ఏపిపిఓ గాదె నాగలక్ష్మి నిర్వహించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, లైజన్ ఆఫీసర్ ఎస్‌కే అబ్దుల్ ఘనీ, కోర్టు పీసీ (కోర్టు డ్యూటీ ఆఫీసర్) దంతోజు కామేష్‌లు సహకరించారు.

Post a Comment