పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని మందులు అందించే గది, రక్తపరీక్ష కేంద్రం, ఇన్‌పేషెంట్ వార్డు, గర్భిణీ స్త్రీల వార్డు, మందులు నిల్వ చేసే స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. ఇన్‌పేషెంట్‌లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఔట్‌పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. కుక్కకాటు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఔషధ నిల్వలు స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో రోగులకు శుచికరమైన, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎవరెంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ రాంప్రసాద్, డాక్టర్లు శైలేష్, మోహన్ వంశీ, ప్రసాద్, రాంప్రసాద్, లావణ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ సరళ, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.