వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారానే మంచి పర్యావరణం, ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం నవభారత్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాఠశాల అసెంబ్లీలో పాల్గొని, వారితో పాటు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం, పాఠశాలలో అసెంబ్లీ నిర్వహణ విధానాన్ని కొనియాడారు.
కలెక్టర్ మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణ పర్యావరణం మరియు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, దీనిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విద్యార్థులకు వివరించారు. వ్యర్థాలను సేకరించడం, శుద్ధి చేయడం, పారవేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియను "వేస్ట్ మేనేజ్‌మెంట్" అంటారని తెలిపారు.వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్రక్రియలను సృష్టించడమే కాకుండా, కొత్త ఆదాయ మార్గాలు కూడా పెంపొందించవచ్చని పేర్కొన్నారు. వంటశాలలోని వ్యర్థాల నుంచి కంపోస్ట్ పిట్ ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేయవచ్చని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులంతా పాఠశాలలో వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచేలా ఉపాధ్యాయులు వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ వెంట పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, పాఠశాల ప్రిన్సిపల్ మైతిలి, పాఠశాల మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment