కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం - కాంపెల్లి కనకేష్ పటేల్

కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం - కాంపెల్లి కనకేష్ పటేల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 2024లో తెలంగాణలో నిర్వహించిన కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ సర్వేను తిరిగి మళ్లీ నిర్వహించాలని కోరుతూ కాంపెల్లి కనకేష్ పటేల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు  వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో వారి జనాభా 28 లక్షలుగా నమోదు అయ్యిందని, అయితే ఇప్పుడు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో 13 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు ఎలా చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల్లో జనాభా పెరగకపోగా 15 లక్షల మంది మున్నూరు కాపులు ఏమైపోయారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం నిర్వహించిన కులగణనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, కావాలనే తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపించారని ఆరోపించారు. 2014లో బీసీ జనాభా 51 శాతం ఉంటే, ఇప్పుడు 46 శాతంగా చూపించడం అధికారుల వైఖరిని అర్థమయ్యేలా చేస్తున్నదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ సర్వేను రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు చింతా నాగరాజు, సాదం రామకృష్ణ, తోట మల్లేశ్వరరావు, మద్దుల వీరమోహన్ రావు, బాలినేని నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గంధం నరసింహారావు, బాలినేని సత్తిబాబు, సమ్మెట వెంకట అప్పారావు, మేడిశెట్టి సాంబశివరావు, అడపా శ్రీనివాసరావు, కొత్తచెరువు హర్షవర్ధన్, బాదర్ల జోషి, రాంశెట్టి లక్ష్మణ్, గంధం సతీష్, పాటి భద్రం, జ్యోతుల రమేష్, సుంకర రంగారావు, భోగి లక్ష్మయ్య, బాలినేని వీరయ్య, బాలినేని సత్యం, జమ్ముల శివ, సత్యాల పెద్దయ్య, ధర్మపురి ప్రసాద్, అన్నం ప్రభాకర్, దేశెట్టి కృష్ణ, బండారి సుధాకర్, పూజాల ప్రసాద్, తోట లోహిత్ సాయి, మద్దిరాల అశోక్, వేమా రాంబాబు, లక్ష్మీనారాయణ, బాలినేని లచ్చు, పుప్పాల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.