పోలింగ్ విధుల పట్ల అవగాహన ఉండాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిని అనుసరించి, జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొత్తం 74 మందికి ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, గడువు లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి వారితో ఓటింగ్ జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పీవోలు తమ పర్యవేక్షణలోనే ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి వెంకటేశ్వర చారి, ఎన్నికల సూపరింటెండెంట్ ధారా ప్రసాద్, డీఎల్ఎంటి పూసపాటి సాయి కృష్ణ, కిరణ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment