విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి - కలెక్టర్

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ఇల్లందు మండలం రొంపేడు గ్రామం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటిస్తూ, వారికి అందుతున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్లు, వంటగదులను తనిఖీ చేసి, సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు.ఈ తనిఖీలలో భాగంగా తరగతి గదిలో విద్యార్థినులతో మమేకమై, "విద్యార్థులు ఎలా చదువుతున్నారు? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు? పాఠ్యాంశాల బోధన పట్ల అవగాహన కలుగుతోందా? మీరు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి? మీకు మోను ఎలా ఉంది?" అనే తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు.

విద్యార్థినీలు చదువుపై శ్రద్ధ చూపి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వసతి గృహంలో లేదా పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం మాట్లాడుతూ, "పిల్లలకు స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం అందించాలి. ఆహారం వండే సిబ్బంది పరిశుభ్రంగా చేతులు కడుక్కొని ఆహార పదార్థాలను సిద్ధం చేయాలి. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ప్రతి విద్యార్థినీ వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక వికాసం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారిని గమనిస్తూ అవగాహన కల్పించాలి. షెడ్యూల్ ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి సబ్జెక్టుపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమాధానాలు చెప్పాలి." అని కలెక్టర్ సూచించారు.వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిత్యం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పించాలని, దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఇల్లందు తహసీల్దార్ రవికుమార్, హాస్టల్ వార్డెన్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.