పెద్దమ్మగుడిలో వైభవంగా శ్రీ శివాలయ ప్రతిష్ఠ

పెద్దమ్మగుడిలో వైభవంగా శ్రీ శివాలయ ప్రతిష్ఠ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాథపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శివాలయంలో శ్రీ స్వామివారి, పరివార దేవతా సహిత జీవధ్వజ పంచాహ్నిక దీక్షా ప్రతిష్టాపన, అమ్మవారి పంచమ పుష్కర (షష్టాబ్ది) పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం. వీరస్వామి పర్యవేక్షణలో జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో తాండవ కాశీక్షేత్రం, తపోవనం ధర్మపురి మఠాధిపతులు అనంత శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ఆధివాస హోమం, గర్తన్యాసం, ధాతున్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. నూతక్కి శ్రీనివాసరావు-రాజకుమారి దంపతులచే నిర్మించబడిన కళ్యాణ మండపం, అన్నదాన సత్రం ప్రారంభం జరిగింది. ఉదయం 11:30 గంటలకు స్థిరమంత్ర, విగ్రహ శిఖర ప్రతిష్ఠా అనంతరం కళాన్యాసం, కళా ప్రతిష్ఠా, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, దృష్టి కుంభం, ధేను దర్శనం కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో పంచమ పుష్కర (షష్టాబ్ది) మహాకుంభాభిషేకం జరిగింది. అనంతరం మహా పూర్ణాహుతి, వషక్షత్సర్జనం, అవబృథ స్నానం, మహా ఆశీర్వచనం, వందితనత్కారం అనంతరం మహా అన్నదానం నిర్వహించారు.


ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివలింగం, పానుమట్టం, గణపతి పీఠం, సుబ్రమణ్య స్వామి పీఠం, కోష్ట మూర్తులు, నందీశ్వరుడు, జంట నాగులు, సూర్యుడు, బలి పీఠం, ద్వారపాలకులు, స్వామివారికి మకరతోరణం, కళ్యాణానికి పట్టువస్త్రాలు, మంగళసూత్రాలు - వనమా వెంకటేశ్వరరావు, ధ్వజస్తంభం - మహిపతి రామలింగం, సరస్వతి, లక్ష్మీదేవి - బాదర్ల బాబుజీ, అన్నపూర్ణ దేవి - సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, దేవతా మూర్తులకు యంత్రములు, త్రికులేశ్వరుడు, దీపాలు, హారతులు, నాగాభరణం, ఇత్తడి ధారపాత్ర - నండూరి శ్రీనివాస్, వెండి ధారపాత్ర - బిక్షపతి, వెండి నాగాభరణం - సంకా వెంకటేశ్వరరావు, నంది వాహనం - పెండ్యాల సతీష్ అందజేశారు.


ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం. వీరస్వామి, జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, ఎమ్మెల్యే కూనంనేని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Blogger ఆధారితం.