వృత్తి నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు: జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం నవభారత్ లోని నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐటీఐ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించి, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణ విధానం, విద్యార్థులు ఎలాంటి కోర్సులు అభ్యసిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మొత్తం ఎంత మంది శిక్షణ పొందుతున్నారనే అంశంపై సిబ్బందితో చర్చించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్యలో శిక్షణ పొందిన విద్యార్థులు పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదగవచ్చని పేర్కొన్నారు. పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చని, అలాంటి వారికి వృత్తి విద్య కోర్సులు ఉపయోగ్యకరంగా ఉంటాయని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతుండటంతో, శిక్షణ పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.
అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, శిక్షణ కేంద్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment