గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26 నుంచి అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలులో భాగంగా రేపటినుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో గ్రామసభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామసభల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి నుండి గ్రామసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, టెంట్లు, మైక్ సెట్లు, త్రాగునీరు తదితర వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజల సమ్మతితో గ్రామసభలు నిర్వహించి, సంక్షేమ పథకాలపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాలని తెలిపారు. జాబితాలో పేరు లేని అర్హుల వద్దనుండి దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రామసభల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రేషన్ కార్డుల జాబితా, మార్పులు చేర్పుల జాబితాలను కూడా గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
గ్రామసభల నిర్వహణకు ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చివరి అర్హుల వరకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని పేర్కొన్నారు.
గ్రామసభల్లో నాలుగు సంక్షేమ పథకాల దరఖాస్తుల వివరాలు మరియు గ్రామసభ తీర్మానాలను పట్టికల రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, పీడీ హౌసింగ్ శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఏవో రమాదేవి, వ్యవసాయ శాఖ ఏడీలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment