డీసీఎంఎస్ ద్వారా నేటి వరకు 3,50,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, ఖమ్మం : జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ శాఖ (డీసీఎంఎస్) ద్వారా నేటి వరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సుమారు ₹99 కోట్ల విలువైన 3,50,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు.
సోమవారం ఖమ్మం డీసీఎంఎస్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని 29 సెంటర్ల ద్వారా 2.56 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలోని 11 సెంటర్ల ద్వారా 94 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని డీసీఎంఎస్ నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. త్వరలో ఈ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులు డీసీఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పరుచూరి రవికుమార్, జక్కుల లక్ష్మయ్య, కుంచపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతీ ఏటయ్య, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment