రైతు ఉద్యమాలకు సంసిద్ధం కావాలి - ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలకు రైతులు సంసిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలోని స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో ఏఐకేఎస్ జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 75% వ్యవసాయ రంగం ఉన్నప్పటికీ బడ్జెట్‌లో 50% నిధులు కేటాయించడమే దీనికి నిదర్శనం అన్నారు. దేశ సరిహద్దుల్లో రైతు నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ 2019 డిసెంబరులో రైతులతో చర్చలు చేసిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని, వాటితో పాటు రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం నిరసనకరమన్నారు. ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించిన రైతులను సరిహద్దుల్లో అడ్డుకోవడం, ముళ్ళ కంచెలతో అడ్డుకోవడం వంటి చర్యలు రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలుగా అభివర్ణించారు. తక్షణమే జాతీయ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, రైతు సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, జిల్లా నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కమటం సురేష్, కుమారి హనుమంతరావు, రవి, ఉకే నారాయణ, వాడే లక్ష్మి, నారటి రమేష్, కోటి నాగేశ్వరరావు, బానోత్ రంజిత్, సీతారాం రెడ్డి, సుబ్బారెడ్డి తదితర రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Post a Comment