అలల ఊయలపై భద్రాద్రి రాముడు..!
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భద్రాచలం మహా పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గౌతమి నది తీరంలో నిర్వహించిన ఈ జలవిహారం భక్తజనాలకు కనుల పండుగగా మారింది.
వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకిలో ఊరేగింపుగా గౌతమి నది తీరానికి తీసుకువచ్చారు. హంస వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కూర్చొబెట్టి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి హారతులు ఇవ్వడమే కాక, భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రాలతో ఆ ప్రాంతం పుణ్యమయంగా మారింది.
విద్యుత్ కాంతుల అలంకరణ, బాణాసంచా వేడుక భక్తులకు మంత్రముగ్ధతను కలిగించాయి. ఐదు సార్లు హంస వాహనంపై తిరుగుతూ శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. భక్తులు గోదావరి ఇసుక తిన్నలపై కూర్చొని ఈ అపురూప ఘట్టాన్ని తిలకించారు.
ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను ఆకర్షించాయి. వేడుకలో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, దేవాలయ అర్చకులు, భక్తజన సమూహం ఈ వేడుకను మరింత వైభవంగా మలిచారు.
శ్రీ సీతారాముల జలవిహారాన్ని వీక్షించి భక్తుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. గోదావరి తీరమంతా భక్తజన సందోహంతో కళకళలాడింది. శ్రీరామ జయరామ అంటూ జయజయధ్వానాలు మిన్నంటాయి.
భద్రాచలం లో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్, భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం రామాలయ ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, దేవాలయ వేద పండితులు, ఉద్యోగులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment