పతకాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ - 2025 పోటీలలో పతకాలను సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు.
జనవరి 4, 5 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి GMC బాలయోగి స్టేడియంలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ - 2025 పోటీలలో ఒక బంగారు, రెండు వెండి పతకాలను సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఘనంగా సన్మానించారు.
50-55 సంవత్సరాల వయసు కలిగి 5 కిలోమీటర్లు, 1500 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం విభాగాలలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం, 1500 మీటర్ల విభాగంలో బంగారు పతకాన్ని, 5 కిలోమీటర్ల మరియు 400 మీటర్ల విభాగాలలో వెండి పతకాలను సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 50 సంవత్సరాల వయసు దాటినా రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం చాలా మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని చాటుకునేలా ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపును సాధించాలి అని సూచించారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా మరిన్ని పతకాలు సాధించి తనకూ, పోలీస్ శాఖకూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం వీరభద్రంని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment