ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ స్థానాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ కానుండగా, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారని, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుందని వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్, పబ్లిక్ పార్క్‌ల వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టికర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కవర్ చేయాలన్నారు.

Post a Comment