ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గిరిజన బాలుర గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై, వారికి అందుతున్న ఆహారం, సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు. మంచినీటి ట్యాపులు లీకేజ్ కావడం గమనించిన కలెక్టర్ స్వయంగా ట్యాప్‌ను బిగించారు. డైనింగ్ హాల్, క్లాస్ రూములు, పరిసరాలు, స్టోర్స్, వంటగదులను స్వయంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారీని పరిశీలించి, వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న అన్నాన్ని తనిఖీ చేశారు. వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం లేదా నాణ్యతలేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చదువు కొనసాగించేలా అనుకూల పరిస్థితులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహం మరియు పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లు, వసతులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో కలెక్టర్‌తో పాటు పాఠశాల హెడ్‌మాస్టర్ బద్రు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment