గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి - సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి - సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం పాల్వంచ మండలంలోని కె.పి. జగన్నాధపురం, నాగారం కాలనీ, రంగాపురం, నాగారం, నారాయణరావుపేట, సంగం గట్టు గ్రామాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా నేతృత్వంలో నాయకుల బృందం పర్యటించి పార్టీ ముఖ్య కార్యకర్తలతో, గ్రామ ప్రజలతో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌ 2025లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల చిరకాల కోరికలైన కొవ్వూరు రైల్వే లైన్‌, మైనింగ్ యూనివర్సిటీ, ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి భారత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రజల భూములను, ఆస్తులను అప్పనంగా అప్పగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తెచ్చిందని పేర్కొన్నారు.


ఆ చట్టాలు రద్దు చేయాలని భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో రెండు సంవత్సరాల పాటు లక్షలాది మంది రైతులు ఢిల్లీలో గొప్ప పోరాటం నిర్వహించారని, ఆ పోరాటానికి భయపడి మోడీ కొంత వెనక్కి తగ్గాడని, కానీ మళ్లీ ఆ చట్టాలను తెచ్చి భారత రైతాంగాన్ని నష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, జగ్జీత్ సింగ్ ధలైవాల్ అనే రైతు ఢిల్లీలో 60-70 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడని, ఆ రైతు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అందజేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో అర్హులైన వారు (లిస్టులో పేర్లు రాని వారు) వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు ఆ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎటువంటి రాజకీయాలకు చోటు లేదని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, నాయకులు నిమ్మల రాంబాబు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, మన్యం వెంకన్న, జక్కరయ్య, వైయస్ గిరి, జర్పుల మోహన్, లావుడియా చందూలాల్, రాందాస్, వెంకటరమణ, శుంకర రంగారావు, హరి, హత్తిరామ్, బానోతు రంజిత్, రవి, చెంచలపురి శ్రీను, సాయిలు శ్రీను, మేక రాంబాబు, బత్తుల గోపాలకృష్ణ, బాదావత్ శీను తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.