కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు కేంద్ర బృందం రాక... మారనున్న జిల్లా రూపురేఖలు

కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు కేంద్ర బృందం రాక... మారనున్న జిల్లా రూపురేఖలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు సమీపంలోనే ఉందని, ఈనెల 20న పలు మండలాల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు పర్యటిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో సూచించిన కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో భూములు అనుకూలంగా లేవని అనుమతి నిరాకరించగా, కొత్తగూడెం పరిధిలోని కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో పలు భూములను గుర్తించామని, అక్కడ సర్వే నిర్వహించాలని తుమ్మల ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు.


ఆ లేఖకు కేంద్ర మంత్రి బదులిస్తూ, ఎయిర్ పోర్టు నిర్మాణానికి సాధ్యసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక బృందం రావాల్సి ఉంటుందని, అందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వయంగా కలిసి అంశాన్ని వివరించారు.

తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, అవసరమయ్యే నిధుల కోసం ప్రత్యేక జీవో విడుదల చేశారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. ఈ అంశాన్ని మంత్రి తుమ్మల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖలో వివరించారు. అలాగే త్వరితగతిన సర్వే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జిల్లాలో అనువైన స్థలంకోసం సర్వే నిర్వహించేందుకు పలు ప్రాంతాలను గుర్తించామని, ఆ భూముల సాధ్యాసాధ్యాలు నిర్ధారించేలా చొరవ చూపాలని తెలిపారు.

మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక బృందం రానున్నట్లు తెలిపారు. ఈ బృందం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగూడెం పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే జిల్లా రూపురేఖలు మారుతాయని మంత్రి అన్నారు. ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా జిల్లా రూపురేఖలు మారుతాయని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా, పారిశ్రామికపరంగా అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, సింగరేణి గనులకు పేరుగాంచిన కొత్తగూడెం, అశ్వాపురంలోని భారీ పరిశ్రమలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు రాకకు ఇది ఉపయోగకరమని పేర్కొన్నారు.

విమానాశ్రయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సహకారం మరువలేనిదని మంత్రి తుమ్మల తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని, ఎయిర్ పోర్టుకు అవసరమైన భూములను గుర్తించేందుకు సహకరించారని ప్రశంసించారు. అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.


Blogger ఆధారితం.