ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలి - కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుకు జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని, గ్రామ సభలను పక్కాగా నిర్వహించాలని, ఈనెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి సర్వేను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ సభల్లో ఫిర్యాదులపై స్పందించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6,000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 చెల్లించనున్నారు. ఈ సర్వేలో పొరపాట్లకు తావులేకుండా భూములను పరిశీలించాలని, అర్హతల ప్రకారం భూముల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 6,000 చొప్పున నగదు సాయం అందించనున్నారు. లబ్ధిదారుల జాబితా రూపొందించేందుకు ఉపాధి హామీ పనిదినాలను పరిశీలించాలని, గ్రామ సభల్లో జాబితాను చర్చించి ఆమోదించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద పూరిగుడిసెలు ఉన్నవారికి, గృహం లేనివారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హుల జాబితాను ఖచ్చితంగా సరిచూడాలని, గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల లేని పేద కుటుంబాలను గుర్తించి, జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించి, చర్చించిన తర్వాత మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో డేటా ఎంట్రీ, ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభల నిర్వహణకు పూర్తి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Post a Comment