చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ. సుచరిత గురువారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద 2018 ఏప్రిల్ 22న సన్యాసి బస్తికి చెందిన కొడాలి నరసింహారావు 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ప్రామిసరీ నోట్ వ్రాయించి ఇచ్చాడు. డబ్బులు ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఇవ్వకుండా, 2019 ఏప్రిల్ 15న కొడాలి నరసింహారావు తన ఖాతా నుండి చెక్కు నాలుగు లక్షల 50 వేల రూపాయలకు ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు అట్టి చెక్కును తన బ్యాంకు ఐఓబీ కొత్తగూడెం బ్రాంచ్‌లో జమ చేయగా, చెక్కు బౌన్స్ అయింది.
అప్పు తీసుకున్న వ్యక్తికి లాయర్ నోటీసు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితుడు కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టులో ఇద్దరు సాక్షుల విచారణ అనంతరం, కొడాలి నరసింహారావుపై నేరం రుజువయ్యింది. దీంతో అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఫిర్యాదుదారుడు కంభంపాటి కోటేశ్వరరావు తరఫున న్యాయవాదులు జీ.వి. ప్రసాద్, జియా హుల్ హస్సన్, సవిత వాదించారు.

Post a Comment