రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు - మంత్రి పొన్నం ప్రభాకర్

 

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు - మంత్రి పొన్నం ప్రభాకర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు-భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.


రోడ్డు భద్రత ప్రమాణాలపై వేడుకలు ప్రతి గ్రామంలో జరగాలని, పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా, మండల ప్రధాన కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలు తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రవాణా, పోలీస్, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రతా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నామని, ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసి పని చేయాలని తెలిపారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహనదారులను హెల్మెట్ వినియోగానికి ప్రోత్సహిస్తూ కొంతమందికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలలో రోడ్డు భద్రతపై పోటీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు.


రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో 75% డ్రైవర్ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని, అందుకే ప్రతి వాహనదారునికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు.


ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా తదితర అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.