అపోహలొద్దు..అభివృద్ధి కోసమే ''కార్పోరేషన్'' - ఎమ్మెల్యే కూనంనేని

అపోహలొద్దు..అభివృద్ధి కోసమే ''కార్పోరేషన్'' -  ఎమ్మెల్యే  కూనంనేని

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం  నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే కార్పోరేషన్ ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి సాధించానని, కార్పోరేషన్ ఏర్పాటు వల్ల నష్టం జరుగుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, కొద్ది రోజుల్లోనే కొత్తగూడెం ప్రాంతం నగరాలకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని టూరిజం హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పోరేషన్ ఏర్పాటు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజల ఆస్తులకు సరైన విలువ పెరుగుతుందన్నారు.


ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్న కొత్తగూడెం ప్రాంతం మరిన్ని పరిశ్రమల ఏర్పాటు దారులు ఏర్పడతాయని, తద్వారా ఉద్యోగ, ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని, జిల్లాలో విస్తారంగా ఉన్న బొగ్గు, విద్యుత్, అటవీ, ఖనిజ సంపద ఆధారిత పరిశ్రమల ఏర్పాటు వేగవంతం కానుందన్నారు. మన పన్నులతోనే ఈ ప్రాంతంలో ప్రజల మౌలిక వసతులు కల్పిస్తున్న పరిస్థితిలో కార్పోరేషన్ ఏర్పాటు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. గిరిజనులకు, గిరిజన చట్టాలకు, రిజర్వేషన్లకు, గిరిజనుల ఆస్తులకు ఎలాంటి నష్టం ఉండబోదని, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలు పూర్తిగా గిరిజన రాష్ట్రాలని అయినప్పటికీ కార్పోరేషన్ విధానం అమలు జరుగుతూనే ఈ రాష్ట్రాల్లో గిరిజన చట్టాలు భేషుగ్గా అమలు అవుతున్నాయని గుర్తుచేశారు.


పన్నులు పెరుగుతాయని, ఉపాధి హామీ పథకం అమల్లో పేదలకు అన్యాయం జరుగుతుందనే వాదనల్లో వాస్తవం లేదని, ఎలాంటి మార్పులు లేకుండా కార్పోరేషన్ పాలనా విధానం కొనసాగుతుందని చెప్పారు. నియోజకవర్గానికి మరో వరంగా విమానాశ్రయం రానుందని, రామవరం-గరీబీపేట ప్రాంతంలో విమానాశ్రయం నెలకొల్పేందుకు జరగాల్సిన సర్వేకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.38 లక్షలు మంజూరు చేసిందని గుర్తుచేశారు.


పురాతన భవనాల స్థానంలో కొత్త ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మాణాలకు కృషి జరుగుతోందని, ఈఎఐ ఆస్పత్రి, నూతన భూగర్భ గనులు, ఐటీహబ్, క్రీడామైదానాలు, జూలోజికల్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

కార్పోరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన రాష్ట్ర మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు.


విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, రాజ్ కుమార్, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వి.పూర్ణచంద్రరావు, భూక్య దస్రు, జి.వీరస్వామి, వంగ వెంకట్, భూక్య శ్రీనివాస్, దీటి లక్ష్మిపతి, పద్మజ, నాగరాజు, రాహుల్, ఫహీమ్, జక్కుల రాములు, నయిమ్ ఖురేషి, పల్లపోతు సాయి, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, కొత్వాల శ్రీనివాస్, ఆళ్ళ మురళి, నాగసీతారాములు, దేవి ప్రసన్న, ముత్తయ్య, ధర్మారావు, తూము చౌదరి, పెద్దబాబు, అంతోటి పాల్, శేఖర్, కె.వెంకన్న, పూనెం శ్రీను, వై.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.