డయాలసిస్ యూనిట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలి - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి అదనంగా కేటాయించబడిన డయాలసిస్ యూనిట్లను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రతి వార్డును పరిశీలించిన ఆయన, ఔట్‌పేషంట్ వార్డులో ఎక్స్ రే యంత్రం పనిచేయకపోవడాన్ని గమనించి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది అది పాడైందని చెప్పగా, కొత్త ఎక్స్ రే యంత్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో ఎంతమంది డ్యూటీ డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో ఉన్నారో పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో చేపడుతున్న డ్రైనేజీ పనులను కూడా ఆయన తనిఖీ చేసి, డ్రైనేజీ పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి, డయాలసిస్ యూనిట్లు ప్రజల అవసరానికి ఉపయోగపడేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా క్యాజువాలిటీ వార్డును మరొక చోటుకు మార్చాలని, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఆసుపత్రి సిబ్బంది, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment