చరిత్ర సృష్టించిన భద్రాద్రి ఆడబిడ్డ.. అభినందనల వెల్లువ

చరిత్ర సృష్టించిన భద్రాద్రి ఆడబిడ్డ.. అభినందనల వెల్లువ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :    అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌లో టీమిండియా ప్లేయర్ త్రిష అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపింది. భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ, మహిళల అండర్-19 వరల్డ్‌ కప్‌లో శతకం సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

ఇటీవల స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లోనే సెంచరీ చేసి దుమ్మురేపింది. తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన త్రిష, ఐసీసీ అండర్-19 టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో భద్రాచలంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.


వివరాల్లోకి వెళ్తే..అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భద్రాచలం ఆడబిడ్డ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె కేవలం 50 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించింది. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసింది. మొత్తం 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా, భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష ఈ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలుస్తోంది. తన 110 పరుగులతో, ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రస్తుత సీజన్‌లో త్రిష స్కోరు 230 పరుగులకు చేరుకుంది.

19 ఏళ్ల త్రిష తెలంగాణలోని భద్రాచలంలో జన్మించింది. రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ సామర్థ్యాలు కలిగి, దేశవాలీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం మలేషియాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారీగా పరుగులు సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఓపెనర్లు త్రిష, కమలిని కలిసి తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ అనంతరం కమలిని ఔటైనా, త్రిష దూకుడు ఆగలేదు. సానికాతో కలిసి చివరి వరకూ క్రీజ్‌లో నిలిచిన త్రిష రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఈ క్రమంలోనే మెరుపు సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది


అభినందనల వెల్లువ:

త్రిష ప్రతిభకు భద్రాద్రి వాసులు అభినందన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అభినందన ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. గొంగడి త్రిష తండ్రి రామిరెడ్డి స్థానికంగా అందరికీ సుపరిచితుడు. త్రిష తన బాల్యంలో భద్రాచలంలోనే చదువుకుంది. ఈ క్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి మంగళవారం సాయంత్రం 4గంటలకు, భద్రాచలం క్రికెట్ గ్రౌండ్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆమెకు అభినందనలు తెలపన్నట్లు వెల్లడించారు.

Blogger ఆధారితం.