విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్

విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల అలవాటుపై ప్రభావితమైన వారిని గుర్తించి, పునరావాస కేంద్రాల ద్వారా వారికి చికిత్స అందించాలి అని తెలిపారు.

కళాశాలలో నిర్వహించే పేరెంట్స్-టీచర్స్ సమావేశాలలో డ్రగ్స్ మరియు గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని, సమాజంలో మంచి, చెడు పై అవగాహన కల్పించాలని సూచించారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు, భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక టోల్-ఫ్రీ నెంబర్ 14416 టెలి-మానస్ సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ టెలి-మానస్ సర్వీసుల ద్వారా నిపుణులైన మానసిక వైద్యులు ఉచిత కౌన్సెలింగ్ సేవలను అందిస్తారని పేర్కొన్నారు.


ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచన రాణి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అధికారి ఆదిశేషు, అన్ని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.