నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే త్వరితగతిన పూర్తి అయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
దరఖాస్తుదారులు ఒకచోట నివసిస్తూ, వేరే ప్రదేశంలో స్థలం కలిగి ఉంటే, ఆ వివరాలను సరిగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, దరఖాస్తుల సంఖ్యపై జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఎక్కడ అధిక సంఖ్యలో దరఖాస్తులు ఉన్నాయో, అక్కడ సర్వే కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవోలు ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థలాలను గుర్తించి, త్వరితగతిన మోడల్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

Post a Comment