పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు భేష్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంతో పోలిస్తే వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని, ఇందుకు జాతీయ స్థాయి NQAS సర్టిఫికేషన్ రావడమే ఉదాహరణ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఆసుపత్రిలో సేవలు మెరుగుపడటానికి కృషి చేసిన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.
గత నెలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగి 100 వరకు చేరుకోవటం, ఖరీదైన సంక్లిష్టమైన మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించటం, రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళకు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు విశేష కృషి చేసిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సరళ, డాక్టర్ సోమరాజు దొర, డాక్టర్ శైలేష్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పటికే, రూ.78 లక్షలు ఎమ్మెల్యే డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా ఆసుపత్రికి కావలసిన సామగ్రి కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవగా..ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్, ఓపెన్ జిమ్ త్వరలో ఏర్పాటు కానున్నాయి. ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడంలో ఎటువంటి సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంవో సోమరాజు దొర, నర్సింగ్ సూపరింటెండెంట్ లక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment