వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

 

వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచనలతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవి రామవరం గుత్తి కోయ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టీ. సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తదితరులు పాల్గొన్నారు.


ముందుగా ఆళ్లపల్లి మీదుగా మర్కోడు చేరుకొని, అక్కడి నుండి ద్విచక్ర వాహనాలపై దట్టమైన అటవీ ప్రాంతం ద్వారా అధికారులు అడవి రామవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఎస్పీ, ముందుగా గ్రామ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్, గుండాల పోలీస్ వారి సహకారంతో గ్రామ ప్రజలకు దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వైద్యులు గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు.


ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ, ఆళ్లపల్లి మండలం అడవి రామవరం ప్రాంతంలో చత్తీస్‌గఢ్ నుండి వలస వచ్చిన ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని వివరించారు.


జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వలస ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఇతర విభాగాల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తుందని ఆయన చెప్పారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ యువత చదువులో రాణించి మంచి ఉద్యోగాలు సాధించి మెరుగైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.


అదే సమయంలో గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని హెచ్చరించారు. మావోయిస్టులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో నిషేధిత మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని తెలిపారు.


ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గుండాల సీఐ రవీందర్, టేకులపల్లి సీఐ సురేష్, ఎస్సైలు రాజమౌళి, రతీష్, శ్రీకాంత్, పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ సంఘమిత్ర, సుదీప్ బృందానికి, ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషాకు కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.