తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి - ఎస్‌ఎఫ్‌ఐ

తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి - ఎస్‌ఎఫ్‌ఐ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌. ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భద్రాచలం పట్టణంలో ఐటిడిఏ ఆఫీస్ ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు (CRT) చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తమ మద్దతు తెలియజేసింది.


ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌. భూపేందర్ మాట్లాడుతూ, గత ఆరు రోజులుగా ఆశ్రమ పాఠశాలల CRT ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఏజెన్సీ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.


 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెబుతున్న నిబంధనలను ప్రభుత్వం అమలు చేయకుండా కాంట్రాక్ట్ టీచర్లను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,100 మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నప్పటికీ వారి ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం ఏమాత్రం కట్టుబడి లేదని, జీతభత్యాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


గత ఆరు రోజులుగా CRT ఉద్యోగులు సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని, పాఠశాలల్లో చదువులు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల సమ్మె కారణంగా సిలబస్ పూర్తికాకపోవడం, పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.


ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Blogger ఆధారితం.