వందేళ్లుగా జనం గుండెల్లో సీపీఐది మహోన్నత స్థానం - సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సీపీఐ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో మహోన్నత స్థానం సంపాదించిందని, ప్రజా ఉద్యమాలు సీపీఐకి ప్రధాన ఆయుధమని, సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన పార్టీగా నిలిచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు. గురువారం సీపీఐ శతవసంతాల వార్షికోత్సవాన్ని పాల్వంచలో ఘనంగా నిర్వహించారు.
చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ సూర్యదేవర రామమోహనరావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా ఊపి ఎర్ర కవాత్‌ను ప్రారంభించారు. పట్టణంలోని కే.ఎస్.పి రోడ్, నటరాజ్ సెంటర్, శాస్త్రి మార్కెట్, రాజీవ్ గాంధీ మార్కెట్, బి.సి.ఎం రోడ్, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద సీపీఐ నాయకుల స్మారక స్థూపాల వద్ద అరుణ పతాకాలను ఆవిష్కరించారు.
సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ, "సీపీఐ 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కార్మిక, కర్షక, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసింది. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, భూస్వాముల, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచింది. నిరంతర ప్రజా ఉద్యమాలతో ప్రజల హక్కులను సాధించటంలో కీలక పాత్ర పోషించింది," అన్నారు.
సీపీఐ పోరాటాల వల్ల అనేక హక్కులు, సౌకర్యాలు సాధించిన సందర్భాలను ఆయన వివరించారు. ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేసి పార్టీని బలోపేతం చేశారని, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని మరింత బలపరిచే దిశగా శ్రమించాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీను, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు యూ. ఉదయ భాస్కర్, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, జి. నగేష్, వీ. పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment