వినియోగదారుల హక్కులను కాపాడాలి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

వినియోగదారుల హక్కులను కాపాడాలి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులు కాపాడటానికి 1986లో చట్టం అమల్లోకి వచ్చిందని, 2019లో దానిలో మార్పులు చేసి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంగా రూపొందించారని తెలిపారు.


ఆన్లైన్ రాయితీలు, ఉచిత ప్రకటనలను చూసి మోసపోకూడదని సూచించారు. హ్యాకర్లు మోసాలు గుర్తించి దోచేస్తారని, పాస్వర్డ్లు సులభంగా ఉండకూడదని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నెంబర్ లను చెక్ చేయాలని, రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు.


డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసాలకు గురైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని, నష్టాన్ని తిరిగి పొందవచ్చని తెలిపారు.


తూనికలు, కొలతల్లో మోసాలు జరగకుండా చూడాలని, వస్తువుల కొనుగోలులో అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యాపారులు తూనికల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకోవాలని, లైసెన్స్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లను తరచుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాథ్ బాబు, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, వాలంటరీ ఆర్గనైజర్స్ జూలూరి రఘు రామాచారి, తెలంగాణ కన్జ్యూమర్ సెయింట్ ఇన్ఫర్మేషన్ రైడ్స్ అవేర్నెస్ ఫోరం గుగులోతు బాలు, కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు మహమ్మద్ రియాజ్, తెలంగాణ కన్స్యూమర్ ఫోరం కొత్తగూడెం సభ్యులు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.