స్వేచ్ఛ సమాజానికి హక్కులే పునాది - లక్కినేని సత్యనారాయణ

స్వేచ్ఛ సమాజానికి హక్కులే పునాది - లక్కినేని సత్యనారాయణ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సమాజంలో మానవుల స్వేచ్ఛ మనుగడకు హక్కులే పునాది అని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, వ్యక్తిగత భద్రతతో జీవించే హక్కును కలిగి ఉన్నాడని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంతో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతకాలనే ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు.

మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజాజీవనం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని, స్వతంత్రంగా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరు హక్కులకు భంగం కలిగించకుండా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరు చట్టాలపైన కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కత్తి రమేష్, న్యాయవాదులు రామారావు, మదన్ మోహన్, బి. మంగీలాల్, విద్యార్థులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.