గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గ్రూప్ 2 పరీక్షలను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు, లోకల్ మరియు జాయింట్ రూట్ అధికారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాల్లో 13,465 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వివరించారు. 100% బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
ఓఎంఆర్ షీట్లు జాగ్రత్తగా పూరించాలి
పరీక్ష హాల్లో ఓఎంఆర్ షీట్ల పూరణలో ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. అభ్యర్థులు తమ వివరాలను కేటాయించిన బ్లాకుల్లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని చెప్పారు.
సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ:
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును సమీక్షించాలని, హాల్ టికెట్ మరియు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు ఉద్దేశించిన రూట్ లో మాత్రమే తీసుకువెళ్లాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరముందని వివరించారు.
సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్లు
అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392919706 లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్లు 040-23542185, 040-23542187 ను ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
ఈ అవగాహన సదస్సులో గ్రూప్ 2 పరీక్షల కన్వీనర్ హరికృష్ణ, డీఎస్పీ ఏఆర్ సత్యనారాయణ (గ్రూప్ 2 పరీక్షల పోలీస్ నోడల్ అధికారి), సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment