సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి : జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఐఏఎస్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఐఏఎస్ అన్నారు. శనివారం సుజాత్ నగర్ మండలంలోని డేగలమడుగు గ్రామంలో ఉన్న గిన్నింగ్ మిల్లులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఐఏఎస్ కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియను పరిశీలించి నిల్వ ఉన్న పత్తిలో తేమ శాతాన్ని స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉండే విధంగా మార్కెట్ కు తీసుకువచ్చేలా రైతులకు సూచించాలని మార్కెటింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
మిల్లులోనికి పత్తి ప్రవేశం మొదలు తేమశాతం పరీక్ష పరిశీలన, తూకం, విక్రయం ధర, రైతుల వేలి ముద్రలతో కూడిన ఆధార్ అనుసంధానం, ఓటిపి విధానం తదితర అన్ని విషయాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రైతుల ఖాతాలలో ఎన్ని రోజుల్లో డబ్బు జమ అవుతున్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాట్సప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను రెండు పని దినాల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎం ఎస్ పి ప్రకారం క్వింటాకు 7521 రూపాయలు రైతులకు చెల్లించాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా సీసీఐ కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి త్రినాథ్ బాబు,జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment