గిరిజనుల అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలి - టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్

 

గిరిజనుల అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలి -   టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆధునికతకు  దూరంగా కొండకోనల్లో నివసించే ఆదివాసీల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర పాలకులు దృష్టి సారించాలని, ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకు గానే పాలకులు పరిగణిస్తున్నారని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ అన్నారు. 

శనివారం పాల్వంచ పట్టణంలోని స్థానిక చంద్ర రాజేశ్వరరావు భవన్ లో జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభ కు హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర పాలకులదే అని అన్నారు. అడవులనే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, హరిత హారం పేరుతో దాడులు, నిర్బంధాలకు పాల్పడుతూ గిరిజనుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లిస్తుండటంతో గిరిజన గ్రామాలు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదన్నారు. 

కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గిరిజనుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధి సాధించలేక పోతున్నారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అమరులైన కొమరంభీం, బిర్షాముండ, సేవా లాల్, మల్లుదొర, సమ్మక్క, సారక్క వంటి మహనీయుల స్ఫూర్తితో ఆదివాసి హక్కుల సాధన, పెట్టుబడి దారుల ఆదిపత్యం నుండి బైటపడేందుకు ఆదివాసీ గిరిజనులు సంఘటితమై ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తి నాయక్, కల్లూరి వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్, సోంది కుటుంబరావు, బానోతు వెంకట్, రామచంద్ర నాయక్, వెంకట్, నర్సమ్మ, భూక్య దసురు, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.