విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలు పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు 100% కృషి చేయాలని, దానికై ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు తగు ప్రణాళికలు రచించుకుని వాటిని సమర్థవంతంగా అమలుపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతులపై పూర్తి దృష్టి పెట్టామని దీనికోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నిధులు విడుదల చేశామని, వీటిని పాఠశాల పరిశుభ్రత కొరకు అలాగే దానికి సంబంధించిన సామాన్లు కొనుగోలుకు మాత్రమే వినియోగించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ పనులను పాఠశాలలో నిర్వహించాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షల గురించి చివరి రెండు నెలల్లో ప్రణాళికలు రచించడం కాకుండా మొదటి నుండే ప్రణాళిక బద్ధంగా పిల్లలను చదివించి పరీక్షలకు సమాయత్వం చేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి, ప్రభుత్వ పరిష్కల సహాయ కమిషనర్ మాధవరావు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగ రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, జిల్లాలోని అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment