హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..



జె.హెచ్.9. మీడియా,హైద‌రాబాద్‌: "హైడ్రా" ఈ పేరు వింటేనే హైదరాబాద్ శివారు ప్రజలు వణకిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో  హైడ్రాకు ఫుల్ పవర్స్ లభించాయి. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ శివారు ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లను, కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుండగా.. న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు హైపవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు అక్టోబర్ 1న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు.

గవర్నర్ ఆమోదంతో ఇక నుంచి హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు, కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. ఈ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే వరకు హైడ్రాకు ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ రక్షణగా నిలవనుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సందేహాలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ నివృత్తి చేయడంతో తాజాగా గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు.

చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, అగ్నిమాపకశాఖ సేవలకు సంబంధించిన ఎన్‌వోసీ జారీ తదితర లక్ష్యాలతో జులై 19న ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కూల్చివేతలు చేపట్టగా.. తాజా ఆర్డినెన్స్‌తో మరిన్ని అధికారాలు హైడ్రాకు వచ్చాయి. దీంతో 

హైడ్రా అంటేనే జంకుతున్న జనం ఇప్పుడు హైడ్రాకు స్పెషల్ పవర్స్ రావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే  ఈ హైడ్రా కూల్చివేతలతో ఎంతో కష్టపడి తమ కలల ఇంటిని నిర్మించుకున్న పేదల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.


Blogger ఆధారితం.