కిన్నెరసాని పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి : కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్ట్  పర్యాటనకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కిన్నెరసాని ప్రాజెక్ట్ పార్క్  అభివృద్ధి పనులను  కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కిన్నెరసాని ప్రాజెక్టు నందు చేయవలసిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో భాగంగా ఆయన పార్క్ నందు పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ, వెదురుతో నీడ సౌకర్యం, పర్సనల్ బోటింగ్, మరుగుదొడ్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, పర్యాటకులు భోజనాలు చేయడానికి వీలుగా కోతులు ఇబ్బంది లేకుండా షెడ్లు చుట్టూ మెస్ ఏర్పాటు చేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా క్యాంటీన్ ఏర్పాటుచేసి తక్కువ ఖర్చుతో తినుబండారాలు, టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేయాలని  అన్నారు. ప్రాజెక్టు పర్యటనకు వచ్చే పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేలా వెలగా మారేడు కరక్కాయ అల్లనేరేడు బంక నక్కేరు తాండ్ర వంటి మొక్కలను వరుస క్రమంలో నాటించాలి అని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పెరుకులేషన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు కావలసిన ప్రతిపాదనలు  వారం రోజుల్లో పంపించాలని అటవీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ తాహశీల్దార్ జి వివేక్ , ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీ ఓ నారాయణ, ఏ ఈ సురేష్, బీట్ ఆఫీసర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.