శరన్నవరాత్రి ఉత్సవాలకు దూరమైన ఏడుపాయల అమ్మవారు
జె.హెచ్.9. మీడియా, మెదక్ : తెలంగాణలో ఎంతో ప్రఖ్యాత చెందిన వన దుర్గామాత ఇప్పుడు దేవీ నవరాత్రుల ఉత్సవాలకు దూరమయింది. దేవి నవరాత్రులలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోని దుర్గా భవానీ అమ్మవార్లు గర్భగుడిలలో వైభవంగా పూజలు అందుకుంటున్నారు. కానీ,ప్రముఖ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయంలోని అమ్మవారు మాత్రం గర్భగుడిలో పూజలు అందుకోవడం లేదు.
మంజీరా నది ఏడు పాయలుగా చీలడంతో అందులోని ఒక పాయలో అమ్మవారి ఆలయం కొలువుదీరింది. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ మంజీరా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ఆలయం వరద నీటిలో చిక్కుకుపోవడం పరిపాటిగా మారింది. అయితే, ప్రస్తుతం దసరా వేడుకలలో భాగంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉండగా..వరద నీరు అడ్డంకిగా మారడంతో ఉత్సవాలు జరగడం లేదు. దీంతో గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, నేడు గాయత్రీదేవి అలంకారంలో ఏడు పాయల దుర్గా భవాని అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో బెజవాడ దుర్గమ్మ, తెలంగాణలో ఏడుపాయల వన దుర్గామాత ఆలయాలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. మహాభారతం తో ముడిపడి ఆనాటి జనమేజయుడు సర్పయాగం జరిగిన మహిమాన్యత ప్రాంతమే ఏడుపాయల. అంతటి ప్రాచీన ప్రాంతంలోని వన దుర్గామాత ఆలయంలో ఇప్పుడు దేవీ నవరాత్రులు సదాసీదాగా జరగడం గమనార్థం..

Post a Comment