పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం - సిపిఐ, సిపిఎం నేతలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాలస్తీనా ప్రజలకు అండగా, ఇజ్రాయిల్ దుశ్చర్యలను భారత సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీల జిల్లా నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు ఆదివారం జరిగిన వామపక్షాల సంయుక్త సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలపై మారణహోమం రోజురోజుకు తీవ్రతరమవుతోందని, ఏడాదిగా వందలాదిమంది పాలస్తీనా ప్రజలు మృతవాత పడుతున్నారని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవతా పరిస్థితులను పూర్తిగా విస్మరించడంతో ఇజ్రాయిల్ రాజ్య హింసం విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విస్తరణవాద స్వభావాన్ని సంతరించుకున్న ఈ దాడులను కండించాలని, పాలస్తీనాలో న్యాయం కోసం పోరాటానికి ప్రపంచ దేశాలు అవిశ్రాంతంగా అలుపెరగని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ఇతర ప్రగతిశీల వ్యక్తులు, సంఘాలు సంఘీభావం తెలపాలని కోరారు.
కేంద్రప్రభుత్వం ఈ వివాదంపై స్పష్టమైన ప్రకటన చేసి పాలస్తీనాలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల కోరారు. వామపక్షాల జాతీయ కమిటీలు, సమితీల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఎమ్మెల్ చంద్రన్నవర్గం జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, మాస్ లైన్ జిల్లా నాయకులు పి సతీష్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులూ గౌని నాగేశ్వర్ రావు , వామపక్షాల నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, వంగ వెంకట్, భూక్యా రమేష్, మోతుకూరి మల్లికార్జునరావు, కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment