పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ స్థాయిలో ఉన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పరిధిలోకి వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను రోజుకు కనీసం 10 దరఖాస్తులు పూర్తి చేసేలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వ భూమి,కోర్టు కేసులు, ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉందా? అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి వివరాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లాలోని అందరూ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment