కొండెక్కిన నిత్యవసర సరుకులు.. సామాన్యుడిపై భారం

కొండెక్కిన నిత్యవసర సరుకులు.. సామాన్యుడిపై భారం

జె.హెచ్.9. మీడియా,తెలంగాణ : పేద, మధ్యతరగతి వర్గాలపై నిత్యవసర సరుకుల భారం మరింతపెరిగింది. షాపులకు వెళ్లి నిత్యవసర సరుకులు కొనాలంటే జనం జంకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు నిత్యవసరాల ధరలు భగ్గుమంటుంటే మరోవైపు కూరగాయల ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మార్కెట్ కి వెళ్ళిన సామాన్యులు చేసేదేమీ లేక అక్కడినుంచి రెండు జేబులలో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, దిగుబడి తగ్గిపోవడం, రవాణా సమస్యలు.. ఇవన్నీ కలిపి కూరగాయల ధరల్ని కొండెక్కేలా చేశాయి. బహిరంగ మార్కెట్ లోనే కాదు.. రైతుబజార్లలో కూడా ఏది కొనబోయినా కొరివే. సరిగ్గా నెలరోజుల కిందట కిలో పాతిక రూపాయలకొచ్చిన టమోటా ఇప్పుడు రెండింతలై హాఫ్ సెంచరీ పలుకుతోంది. 50 నుంచి 70 రూపాయలు ఇచ్చుకుంటే తప్ప కిలో కూరగాయలు రావడం లేదు. దానికి తోడు వెల్లుల్లి, ఉల్లి ధరలు సైతం కొన్నవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

మార్కెట్లో వంట నూనెలు సైతం భగ్గుమంటున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు లీటర్‌కు 20 రూపాయలకు పైగా పెరిగింది. వేరుశనగ నూనె 160 రూపాయలు దాటి.. డబుల్ సెంచరీని టచ్ చెయ్యబోతోంది. కొబ్బరి నూనెదీ అదే దారి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు భారీగా పెంచడమే ఈ మంటకు కారణమట. 

ఆకుకూరలైతే ముట్టుకుంటే చాలు అగ్గి రాజుకుంటోంది. మార్కెట్లో ఇతర కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల రేట్లు కాసింత కనికరిస్తాయి. అందరికీ అందుబాటులో ఉంటాయి. 20 రూపాయలకు ఆరు కట్టల పాలకూర  వచ్చేది. పది రూపాయలు ఇస్తే రెండుమూడు కొత్తిమీర, పుదీనా కట్టలొచ్చేవి. కానీ ఇప్పుడైతే వందనోటిస్తే తప్ప వచ్చేదే లే అంటోంది కొత్తిమీర కట్ట.

ఇంతకుముందు రెండు వందనోట్లు పట్టుకెళితే కనీసం నాలుగైదు రకాల కూరగాయలతో చేతిలో సంచి నిండేది. ఇప్పుడైతే వెజిటబుల్ బడ్జెట్ కూడా ఐదొందలు దాటిపోతోంది. సాధారణంగా కార్తీక మాసంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యి రబీ పంట మొదలయ్యే లోపు కూరగాయల ధరలు పెరగడం కామన్. కానీ.. కూరగాయలే కాదు.. నూనె ప్యాకెట్టు కూడా భగ్గుమంటుంటే.. ఏం కొనాలో.. ఎలా కొనాలో అర్థం కాక సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.


Blogger ఆధారితం.