పారను చేత పట్టి... పరిసరాలను శుభ్రపరిచిన కలెక్టర్.
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో ఈనెల 17 నుంచి చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా యువజన క్రీడలు, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా యువజన క్రీడా అధికారి పరందామ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, విద్యాశాఖ నుండి సైదులు, ఎస్ ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వనజ, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవో బీవీ చలపతి, ఎన్ఎస్ఎస్ అధికారి పూర్ణచందర్, హాకీ కోచ్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో క్రీడాకారులకు కావలసిన విశాలమైన స్థలం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ నిధుల నుండి రన్నింగ్ ట్రాక్, హాకీ కోర్టు, వాలీబాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సదుపాయాలు సమకూర్చుతామని తెలిపారు.కళాశాలలో పూర్వం చదువుకున్న విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అందరూ సమిష్టిగా పనిచేసి కళాశాల మైదానాన్ని క్రీడాకారులకు మరింత సౌకర్యవంతంగా తయారు చేద్దామన్నారు. కళాశాల మైదానంలో పెరిగిన పిచ్చి చెట్లు గడ్డి పొదలు, పంచాయతీ సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు కలిసి తొలగించాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో మహిళలు తడి, పొడి చెత్త వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని దానివల్ల ప్రభుత్వానికి సహాయపడిన వారు అవుతారని అన్నారు. ప్రజలు, అధికారులు శానిటైజషన్ సిబ్బంది సహకారం వల్ల అతి కొద్ది కాలంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పరిశుభ్ర జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని చెప్పారు.
పరిసరాల పరిశుభ్రతే మనందరి బాధ్యతగా ముందుకు సాగాలని అని కలెక్టర్ అన్నారు. కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, పార్కులను అభివృద్ధి పరిచి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా మారుస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ప్రజలు ప్రముఖ పాత్రను పోషించేందుకు గాను ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

.webp)
.jpeg)
.webp)
Post a Comment